చేయూత పింఛన్ల దరఖాస్తుల స్వీకరణపై కలెక్టర్ సమీక్ష

జిల్లాలో చేయూత పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారుల నుంచి ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, తలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియా బాధితులకు సంబంధించిన పింఛన్ల దరఖాస్తుల స్వీకరణపై చర్చించారు.

అలాగే గీత కార్మికులు, నేత కార్మికులు, పైలేరియా, డయాలసిస్ బాధితుల పింఛన్లకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ, అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. దరఖాస్తుల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.