Chennur: చెన్నూరులో డ్రగ్స్‌పై పోలీసుల నిఘా.. నార్కోటిక్ డాగ్‌తో విస్తృత తనిఖీలు

మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పట్టణ సమీపంలోని 63వ జాతీయ రహదారి పరిసర ప్రాంతాల్లో ఉన్న హోటళ్లు, పాన్ షాపులతో పాటు అనుమానిత ప్రదేశాల్లో నార్కోటిక్ డాగ్ సహాయంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

నాటుసారా, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద ప్రదేశాలు, ప్రాంతాలను గుర్తించి నార్కోటిక్ డాగ్‌ల సహాయంతో తనిఖీలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులోనూ ఈ తనిఖీలను తరచుగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. డ్రగ్స్‌కు బానిసై విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా లేదా వినియోగానికి సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.