Bonda Uma: డీఎస్సీపై వైసీపీ గలాటా చేస్తోంది.. బోండా ఉమా తీవ్ర ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ అంశం మరోసారి రాజకీయ వేడిని పెంచుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, విమర్శలు, సవాళ్లు కొనసాగుతున్నాయి. డీఎస్సీ పేరుతో వైసీపీ అరాచకానికి పాల్పడుతోందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అరాచకం శృతి మించిందని మండిపడ్డారు. డీఎస్సీ అంశంపై మంత్రి నారా లోకేష్ చర్చకు సిద్ధమని ప్రకటించినప్పటికీ వైసీపీ నాయకులు చర్చకు ముందుకు రావడం లేదని విమర్శించారు.

బ్రిడ్జ్ గేమ్ కేంద్ర ప్రభుత్వ పాలసీలో భాగమని, దానిని పేకాటతో పోల్చుతూ వైసీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బోండా ఉమా అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఈ అంశంపై పేపర్ రూపంలో లిఖితపూర్వక వివరణ ఇచ్చిందని తెలిపారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు ఎనిమిది నెలలుగా విధులు నిర్వహిస్తున్నారని, ఇప్పుడు వారిని ఇబ్బందులకు గురిచేసేలా వైసీపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు.

గత వైసీపీ పాలనలో యువత భవిష్యత్తుతో ఆడుకున్నారని బోండా ఉమా విమర్శించారు. ఆ సమయంలో జరిగిన పరిణామాలకు అధికారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. మెగా డీఎస్సీ జరగకుండా వైసీపీ 220 కేసులు వేసిందని ఆరోపించారు. అయితే కోర్టు ఆ ఆరోపణలను ప్రాథమిక స్థాయిలోనే తిరస్కరించిందని, మెగా డీఎస్సీ ప్రక్రియ సక్రమంగా జరిగిందని కోర్టు ధృవీకరించిందని పేర్కొన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ ప్రస్తుతం ఈ అంశంపై గలాటా చేస్తోందని బోండా ఉమా ఆరోపించారు.