చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పూతలపట్టు మండల కేంద్రంలోని సంఘం సూపర్ బజార్‌లో పేద ప్రజలకు ఉపశమనం కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించారు. నిత్యావసర వస్తువుల ధరలతో పాటు బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో స్టీమ్ బియ్యం కిలో ధరను రూ.62 నుంచి రూ.52కు, రా బియ్యం కిలో ధరను రూ.58 నుంచి రూ.50కి తగ్గించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని నిత్యావసర వస్తువులు, బియ్యం ధరలు వారికి భారంగా మారకుండా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో తక్కువ ధరకే బియ్యం అందుబాటులోకి రావడం పేద కుటుంబాలకు కొంత ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీఎస్ఓ కార్యాలయం నుంచి రవీంద్రబాబు, హిమ్మత్, పూతలపట్టు సీఐ తిమ్మయ్య, తహసీల్దార్ ఉదయ్ కిషోర్, ఎంపీడీవో నాగరాజు, ఈడీటీ మహేశ్వరి, డీటీ మునికృష్ణ, పూతలపట్టు మండల టీడీపీ కన్వీనర్ దొరబాబు చౌదరి, తెలుగుదేశం నాయకులు మురళి, చంద్రమౌళి, సింగల్ గుండు అధ్యక్షుడు జగన్నాథం, రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు సురేంద్ర నాయుడు, ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది, రేషన్ కార్డు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.