సఖినేటిపల్లిలో తక్కువ ధరకే బియ్యం విక్రయాల కార్యక్రమం ప్రారంభం

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తక్కువ ధరకే బియ్యం విక్రయాల కార్యక్రమాన్ని రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు. ప్రజలకు అందుబాటు ధరలో నాణ్యమైన బియ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై నిత్యావసర వస్తువుల ధరల భారం తగ్గించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అధికారులు పర్యవేక్షించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.