‘జన నాయగన్’ విడుదలతో కోలీవుడ్‌లో పండుగ వాతావరణం

విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రం జన నాయగన్ థియేటర్లలో విడుదల కావడంతో కోలీవుడ్ అంతటా పండుగ వాతావరణం నెలకొంది. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున థియేటర్లకు తరలివచ్చి ఈ సినిమాను వీక్షిస్తూ విజయ్ సినీ ప్రయాణానికి ఘనమైన వీడ్కోలు పలుకుతున్నారు.

విజయ్‌తో గిల్లి, లియో, గోట్ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన స్టార్ హీరోయిన్ త్రిష అభిమానులతో కిక్కిరిసిన రోహిణి థియేటర్స్ను సందర్శించి సినిమాను వీక్షించారు. ఆమె తల్లి ఉమా కృష్ణన్ కూడా అదే థియేటర్‌కు రావడం విశేషం.

ఇక విజయ్ వీరాభిమాని అయిన కీర్తి సురేష్ తన భర్త ఆంటోని తట్టిల్తో కలిసి వెట్రి థియేటర్స్లో సినిమా చూశారు. అదే వేదికపై ఉన్న యంగ్ హీరోయిన్ మమిత బైజును కీర్తి సురేష్ అభినందించారు. ఈ చిత్రంలో మమిత బైజు విజయ్ కూతురిగా కీలక పాత్ర పోషించగా, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ కూడా థియేటర్‌కు వచ్చి సినిమాను ఆస్వాదించారు.