జేడీ వాన్స్ దంపతులకు నాలుగో సంతానం.. మగబిడ్డకు ‘అలెక్ నీల్ వాన్స్’ పేరు

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబంలో సరికొత్త ఆనందం వెల్లివిరిసింది. ఆయన సతీమణి, అమెరికా ద్వితీయ ప్రథమ మహిళ ఉషా వాన్స్ ఆదివారం ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని జేడీ వాన్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటిస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.

వాన్స్ దంపతులు తమ చిన్న కుమారుడికి అలెక్ నీల్ వాన్స్ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. “మాకు మగబిడ్డ జన్మించాడని ప్రకటించడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ఉషా, బాబు ఇద్దరూ పూర్తి ఆరోగ్యంతో, క్షేమంగా ఉన్నారు. మా ముగ్గురు పిల్లలు తమ బుజ్జి తమ్ముడిని చూసి ఎంతో సంబరపడిపోతున్నారు” అని జేడీ వాన్స్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

డెలివరీ సమయంలో అద్భుతమైన సేవలు అందించిన వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్ వైద్యులకు, వైట్ హౌస్ మెడికల్ టీమ్‌కు ఈ దంపతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ శుభవార్తతో జేడీ వాన్స్ కుటుంబానికి ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.