అనంతపురం అభివృద్ధి పనులపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భేటీ

అనంతపురం నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్‌తో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ శనివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కలెక్టరేట్‌లో జరిగిన ఈ భేటీలో నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డ్ వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

నగరంలో ఇప్పటికే ప్రారంభమైన అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కొత్త ప్రాజెక్టులకు అవసరమైన నిధుల విడుదల కోసం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందేలా అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని కోరారు.

అలాగే డంపింగ్ యార్డ్‌లో పేరుకుపోయిన చెత్తను త్వరితగతిన తొలగించి, అక్కడ ఆధునిక వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌తో పాటు అందమైన పార్కు నిర్మాణానికి తక్షణమే టెండర్లు పిలిచేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు.