హైడ్రోజన్ రైలు ఎలా పనిచేస్తుంది? ప్రయాణంలోనే ఇంధనం తయారవుతుందా?

భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కిన నేపథ్యంలో ఈ సాంకేతికతపై ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా రైలు ప్రయాణిస్తున్న సమయంలోనే హైడ్రోజన్ ఇంధనం తయారవుతుందా? లేక ముందే నింపుతారా? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం నడుస్తున్న హైడ్రోజన్ రైళ్లలో ప్రయాణ సమయంలో ఇంధనం తయారవదు.

రైలు బయలుదేరే ముందు అధిక పీడనంతో నింపిన హైడ్రోజన్ గ్యాస్‌ను ప్రత్యేక ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. ఈ ట్యాంకులు ఫ్యూయల్ సెల్ వ్యవస్థకు అనుసంధానమై ఉంటాయి. ఫ్యూయల్ సెల్‌లో హైడ్రోజన్, గాలిలోని ఆక్సిజన్‌తో రసాయన చర్య జరగడంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్‌తో ఎలక్ట్రిక్ మోటార్లు పనిచేసి రైలును ముందుకు నడిపిస్తాయి.

ఈ ప్రక్రియలో పొగ లేదా కార్బన్ ఉద్గారాలు వెలువడవు. ఉప ఉత్పత్తులుగా కేవలం నీరు, స్వల్ప వేడి మాత్రమే విడుదల అవుతాయి. అందువల్ల హైడ్రోజన్ రైళ్లను పర్యావరణహిత, కాలుష్య రహిత రవాణా వ్యవస్థగా ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహిస్తున్నారు.