తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత కనిపించడంతో భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గాలిగోపురాన్ని దాటిన అనంతరం నడకమార్గంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులు తీశారు. భక్తుల అరుపులు, రద్దీ కారణంగా చిరుత సమీపంలోని అడవిలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని అధికారులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న అటవీశాఖ, సంబంధిత అధికారులు వెంటనే అప్రమత్తమై నడకమార్గంలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేస్తున్నారు. భక్తుల రాకపోకలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అడవి ప్రాంతాలను నిరంతరం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, రెండేళ్ల క్రితం కూడా తిరుమల మెట్ల మార్గంలో చిరుతల సంచారం భక్తుల్లో భయాందోళనకు కారణమైంది. అప్పట్లో అటవీశాఖ అధికారులు ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేసి కొన్ని చిరుతలను బంధించారు. అలాగే టీటీడీ భక్తులు గుంపులుగా నడవాలని, ఒంటరిగా ప్రయాణించకుండా కర్రలు వెంట తీసుకెళ్లాలని సూచిస్తూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.