జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ముంబైలో కుడి భుజానికి విజయవంతంగా రొటేటర్ కఫ్ శస్త్రచికిత్స జరిగింది. సుమారు మూడున్నర గంటల పాటు కొనసాగిన ఈ ఆపరేషన్ అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
వైద్యుల వివరాల ప్రకారం, పవన్ కల్యాణ్ రెండు భుజాల్లోనూ తీవ్రమైన రొటేటర్ కఫ్ గాయాలతో బాధపడుతున్నారు. 2016లో తగిలిన గాయాలు కాలక్రమేణా మరింత తీవ్రమవగా, పోరాట యాత్ర, వారాహి యాత్రల సమయంలో భుజాలపై అధిక ఒత్తిడి పడినట్లు గుర్తించారు. అభిమానులతో తరచూ కరచాలనాలు చేయడం, చేతులు పట్టి లాగడం కూడా ఈ సమస్యను మరింత పెంచినట్లు వైద్యులు వెల్లడించారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో కండరాల చీలికలు, రొటేటర్ కఫ్ గాయాలు స్పష్టంగా బయటపడటంతో వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అన్ని అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసిన అనంతరం పవన్ కల్యాణ్ ముంబై వెళ్లి ఈ శస్త్రచికిత్స చేయించుకున్నారు. మరో రెండు నెలల్లో ఆయన ఎడమ భుజానికి కూడా శస్త్రచికిత్స నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.