సంగారెడ్డి నుంచి పోటీ చేయను.. కానీ ఎక్కడి నుంచో పార్టీనే నిర్ణయిస్తుంది: జగ్గారెడ్డి

కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయనని స్పష్టం చేసిన ఆయన, అయితే వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయనని ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. తాను ఎక్కడి నుంచి బరిలోకి దిగాలనేది పూర్తిగా పార్టీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.

వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను జగ్గారెడ్డి గుర్తు చేశారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

అలాగే కాంగ్రెస్ 117 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకోవడం మంచి ఆలోచన అని జగ్గారెడ్డి అన్నారు. ఎన్నికలకు రెండేళ్ల ముందే పార్టీని సిద్ధం చేయడం రాజకీయ నాయకుడిగా సీఎం తీసుకున్న సరైన నిర్ణయమని పేర్కొంటూ, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.