ఏపీ రైతులకు అలర్ట్.. పంటల బీమాకు కొత్త నిబంధనలు, జూలై 15 వరకు మాత్రమే గడువు

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరీఫ్-2026, రబీ 2026-27 సీజన్లకు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా అమలుకు జీవో నంబర్-34 జారీ చేసింది. ఈ పథకం అమలుకు రూ.250 కోట్లు మంజూరు చేస్తూ, పాత క్లస్టర్లు, జిల్లాల వారీగా కొత్త బీమా కంపెనీల భాగస్వామ్యంతో స్వచ్ఛంద నమోదు ప్రక్రియను పునరుద్ధరించింది.

అయితే ఈ ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ‘అగ్రిస్టాక్ ఫార్మర్ ఐడీ’ని తప్పనిసరి చేశారు. దీంతో కౌలు రైతులు, అటవీ భూములు, దేవదాయ భూముల్లో సాగు చేస్తున్న రైతులు ప్రస్తుతం బీమా పరిధికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినప్పటికీ, వారి నమోదుపై ఇంకా స్పష్టత రాలేదు.

మరోవైపు వాతావరణ ఆధారిత పంటల బీమా ప్రీమియం చెల్లింపునకు జూలై 15 వరకు మాత్రమే గడువు ఉండటంతో రైతులకు చాలా తక్కువ సమయం మిగిలింది. రైతు ఐడీ, ఈ-పంట నమోదు, బ్యాంకు ప్రక్రియలు పూర్తి చేయడానికి సమయం సరిపోదని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆలస్యంగా నోటిఫికేషన్ రావడంతో వేలాది మంది రైతులు పంటల బీమా ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.