నేతన్నకు భరోసా.. త్వరలో రూ.25 వేల ఆర్థిక సాయం జమ: మంత్రి సవిత

 

ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ‘నేతన్నకు భరోసా’ పథకం కింద అర్హులైన చేనేత కార్మికులకు ఏటా అందించే రూ.25,000 ఆర్థిక సాయం పంపిణీకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత వెల్లడించారు. త్వరలోనే ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఆమె తెలిపారు.

మంగళగిరిలో నిర్వహించిన ఆప్కో గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సవిత, చేనేత సహకార సంఘాలకు పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపులపై కూడా కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం విడతల వారీగా బకాయిలను విడుదల చేయాలని నిర్ణయించిందని, ఈ నెల 15న రూ.4 కోట్లను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

అదేవిధంగా వచ్చే నెల మొదటి వారంలో మరో రూ.2.5 కోట్ల బకాయిలను చేనేత సహకార సంఘాలకు చెల్లిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది చేనేత కార్మికులు, సహకార సంఘాలకు ఆర్థిక ఊరట లభించనుందని ఆమె పేర్కొన్నారు.