రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఖమ్మంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రిని కూడా నియమించలేకపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటోందని విమర్శించారు.
రాష్ట్రంలో విద్యాశాఖకు పూర్తి స్థాయి మంత్రి లేకపోవడం వల్ల విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకపోవడంతో పరిస్థితి మరింత దిగజారుతోందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.9,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్ నిధులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందేవని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ నిధులు, వేతనాలు విడుదల చేయాలని, లేకపోతే విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.