పోక్సో కేసులో బండి సాయి భగీరథ్‌కు బెయిల్ వద్దన్న పోలీసులు.. హైకోర్టులో కౌంటర్

 

మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ మంజూరు చేయవద్దని తెలంగాణ పోలీసులు హైకోర్టును కోరారు. నిందితుడికి బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అలాగే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని దర్యాప్తు అధికారులు కోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె. విజయవర్ధన్ సమర్పించిన కౌంటర్ ప్రకారం.. 17 ఏళ్ల మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్న భగీరథ్, 2025 నుంచి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో ఆధారాలు లభించినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని శ్రీరామ్ గార్డెన్స్, నానక్‌రామ్‌గూడలోని గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో ఈ ఘటనలు జరిగినట్లు పేర్కొంటూ, భారతీయ న్యాయ సంహిత (BNS), పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు కోర్టుకు వివరించారు.

ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బండి సాయి భగీరథ్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కేసులో ఇరికించారని వాదిస్తూ రెగ్యులర్ బెయిల్ కోరారు. ఇరు పక్షాల వాదనలను పరిశీలించిన హైకోర్టు, పోలీసుల కౌంటర్‌ను రికార్డులోకి తీసుకుని బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను జులై 8కు వాయిదా వేసింది.