తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. జులై 14న నిర్వహించే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జులై 17న జరిగే ఆణివార ఆస్థానం సందర్భంగా రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో జులై 13, జులై 16 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ తిరుమల యాత్రను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచించారు.
అలాగే జులై 17న ఆణివార ఆస్థానం సందర్భంగా పలు ఆర్జిత సేవలను కూడా రద్దు చేశారు. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు ఆ రోజు నిర్వహించబడవని టీటీడీ తెలిపింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు టీటీడీ నిబంధనల ప్రకారం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.