హైదరాబాద్‌లో నేడు బీబీ కా ఆలం ఊరేగింపు.. ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘బీబీ కా ఆలం’ ఊరేగింపు ఈరోజు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగనుంది. పాతబస్తీలోని దబీర్‌పురా నుంచి ప్రారంభమయ్యే ఈ భారీ ఊరేగింపు చార్మినార్, గుల్జార్ హౌస్, మదీనా, పురాణాపూల్ మీదుగా అఫ్జల్‌గంజ్ వరకు సాగనుంది. ఈ నేపథ్యంలో వేలాదిగా తరలివచ్చే భక్తులు, ఊరేగింపును దృష్టిలో ఉంచుకుని నగర పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఈ ప్రధాన మార్గాల్లో ఊరేగింపు సాగేంతవరకు ట్రాఫిక్‌ను దారి మళ్లించనున్నట్లు అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. దబీర్‌పురా, చార్మినార్, ముజాహిద్‌పురా, శాలిబండ, పంజాషా, ఈద్గా మైదానం వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

ఉరేగింపు సాగే మార్గాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు సిబ్బందిని భారీగా మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపు ప్రాంతాల్లో వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు, వాహనదారులు పోలీసుల సూచనలను పాటించి, ఊరేగింపు ముగిసే వరకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.