ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన యువకుడు గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటూ ఇప్పటికే సస్పెన్షన్కు గురైన కృష్ణలంక మాజీ సీఐ ఎస్ఎస్వీవీ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ – SIT) అధికారులు అరెస్టు చేశారు. ఉదయం అజిత్ సింగ్ నగర్లోని ఆయన నివాసానికి చేరుకున్న సిట్ బృందం, నాగరాజును అదుపులోకి తీసుకుని పోలీస్ గెస్ట్ హౌస్కు తరలించింది. అక్కడ ఆయనను పలు గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించి, స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం అధికారికంగా అరెస్టు చేశారు.
గత మే నెలలో కృష్ణలంక పోలీసులు తన కుమారుడైన సాయికృష్ణను విచారణ పేరుతో అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని, పోలీస్ స్టేషన్లోనే థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు పెట్టి చంపేశారని అతని తల్లి విజయలక్ష్మి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆధారాలు దొరక్కుండా మృతదేహాన్ని సైతం మాయం చేశారని ఆమె ఆరోపించారు. ఈ ఫిర్యాదుతో దర్యాప్తు వేగవంతం చేసిన సిట్ అధికారులు.. తాజాగా ఈ కేసును హత్యా నేరంగా (బీఎన్ఎస్ఎస్ 103(1) సెక్షన్ కింద) మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్రమ నిర్బంధం, కస్టడీలో వేధింపులు, సాక్ష్యాధారాలు మాయం చేయడం వంటి తీవ్రమైన అభియోగాలతో సీఐపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
బాధితురాలి ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ మిస్టరీని ఛేదించేందుకు ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, అరెస్టు కోసం అధికారులు నాగరాజు ఇంటికి వెళ్లిన సమయంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయన మద్దతుదారులు, అనుచరులు భారీగా చేరుకుని పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మరోవైపు, పోలీస్ స్టేషన్లో మాయమైన నెల రోజుల సీసీటీవీ (CCTV) ఫుటేజీని టెక్నికల్ నిపుణుల సాయంతో రికవరీ చేసే పనిలో సిట్ అధికారులు నిమగ్నమయ్యారు. ఈ అరెస్టుతో సాయికృష్ణ మిస్సింగ్ వెనుక ఉన్న మరిన్ని సంచలన వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.