నలగండ్ల రియల్ గ్రోత్.. అప్పట్లో వద్దు అనుకున్నారు, ఇప్పుడు కొనలేకపోతున్నారు!

హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలోని నలగండ్ల (Nallagandla) రియల్ ఎస్టేట్ మార్కెట్ ఊహించని రేంజ్‌లో దూసుకుపోతోంది. ఓ పదేళ్ల క్రితం వరకు “అంత దూరం ఎందుకులే” అని చాలా మంది ప్లాట్లు, ఇళ్లు కొనడానికి వెనుకడగా.. ఇప్పుడు అదే ప్రాంతంలో రేట్లు చూసి నోరెళ్లబెట్టే పరిస్థితి వచ్చింది. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ హబ్‌లకు అత్యంత సమీపంలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డు (ORR) కనెక్టివిటీ, మెరుగైన మౌలిక వసతుల కారణంగా గత రెండేళ్లలో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి.

ప్రస్తుతం నలగండ్ల పరిసర ప్రాంతాల్లో గజం భూమి కొనాలంటే అక్షరాల లక్ష రూపాయలకు పైనే వెచ్చించాల్సి వస్తోంది. వెంచర్లలో కాస్త లోపలికి ఉండే ప్లాట్లు కూడా గజం లక్ష నుంచి లక్షన్నర పలుకుతుండగా.. వంద గజాల స్థలం కావాలన్నా కోటిన్నర వరకు బడ్జెట్ పెట్టాల్సి వస్తోంది. ఇక హుడా (HUDA) లేఅవుట్లు, ప్రధాన రహదారులకు సమీపంలో ఉన్న ప్లాట్ల ధరలైతే గజానికి 2 లక్షల నుండి 3 లక్షల రూపాయల వరకు పలుకుతుండటంతో మధ్యతరగతి ప్రజలకు ఇక్కడ స్థలం కొనడం అందని ద్రాక్షలా మారింది.

ప్రశాంతమైన వాతావరణం, విశాలమైన రోడ్లు, గ్రీనరీతో పాటు విదేశాల్లో స్థిరపడిన ఎన్‌ఆర్ఐలు (NRIs), ఐటీ ప్రొఫెషనల్స్ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎగబడుతుండటంతో డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. అపార్ట్‌మెంట్ల ధరలు కూడా చదరపు అడుగుకు (Sq.Ft) దాదాపు 9 వేల నుండి 12 వేల రూపాయల పైమాటే పలుకుతున్నాయి. ఒకప్పుడు ముళ్లపొదలతో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లతో సరికొత్త బిజినెస్ హబ్‌గా రూపాంతరం చెందాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *