బండి భగీరథ్ పోక్సో కేసు: తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ ఆదేశాలు

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ కేసుపై తక్షణమే సమగ్ర దర్యాప్తు ప్రారంభించాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆయన ఆదేశించారు. మే 8వ తేదీనే పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందినప్పటికీ, నిందితుడిపై తదుపరి చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరిగిందని అధికారులను సీఎం తీవ్ర స్థాయిలో నిలదీశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరగాలని స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ అడిగిన ప్రశ్నలకు డీజీపీ బదులిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసు బలగాలన్నీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నందువల్లే దర్యాప్తులో కొంత జాప్యం జరిగిందని వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఓ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈ విచారణ పర్యవేక్షణ బాధ్యతలను కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్‌కు అప్పగిస్తూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది.

17 ఏళ్ల మైనర్ బాలికను వేధించాడనే ఆరోపణలతో భగీరథ్‌పై పోలీసులు పోక్సో చట్టంతో పాటు బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, ఆ బాలిక కుటుంబ సభ్యులు డబ్బుల కోసం తనను బ్లాక్‌మెయిల్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని భగీరథ్ సైతం కరీంనగర్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కౌంటర్ కేసు కూడా నమోదైంది. మరోవైపు, ఈ సున్నితమైన వ్యవహారంపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (TSCPCR) ఛైర్‌పర్సన్ సీతాదయాకర్‌రెడ్డి స్పందించి, విచారణను పరిశీలించేందుకు ఓ ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *