ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలోని సచివాలయంలో జరిగిన రెండు రోజుల 7వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. మార్చి, ఏప్రిల్ నెలల్లోనే రాష్ట్రంలోని అనేక పంచాయతీలు, మున్సిపాలిటీల పదవీకాలం ముగిసి ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన సాగుతోందని, వీలైనంత త్వరగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పాలకవర్గాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభించాలని, ముఖ్యంగా బీసీ జనాభా లెక్కింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా పారదర్శకంగా ముందుకు వెళ్తామని చెప్పారు. వచ్చే ఆరు నెలల్లోపు ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు వంటి ప్రాథమిక పనులపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
కేంద్ర నిధుల రాకకు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి స్థానిక సంస్థల ఎన్నికలు అనివార్యమని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తోందని, స్థానిక సంస్థలు బలోపేతం అయితేనే సుపరిపాలన సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాల కంటే అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, ఎక్కడా అవినీతికి తావులేకుండా ఎన్నికలు నిర్వహించేలా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.