భారతదేశం త్వరలోనే ఇంధన శక్తిలో స్వయంసమృద్ధి సాధించడమే కాకుండా, ప్రపంచానికే దిక్సూచిగా మారబోతోంది. దీనికి ప్రధాన కారణం మన దేశంలో అపారంగా ఉన్న థోరియం (Thorium) నిల్వలు. బంగారం కంటే విలువైనదిగా భావించే ఈ లోహం, భవిష్యత్తులో అణుశక్తి ఉత్పత్తికి వెన్నెముకగా మారనుంది. ప్రస్తుతం మన తీర ప్రాంతాల్లోని మోనోజైట్ ఇసుకలో కోట్ల రూపాయల విలువ చేసే భారీ నిల్వలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. “మనల్ని ఎవడ్రా ఆపేది” అన్న చందంగా భారత్ ఇప్పుడు గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌ను శాసించే దిశగా అడుగులు వేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న థోరియం నిల్వలలో సుమారు 25 శాతం కేవలం భారతదేశంలోనే ఉండటం విశేషం. ముఖ్యంగా కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు తమిళనాడు తీర ప్రాంతాల్లో ఈ నిల్వలు విస్తారంగా ఉన్నాయి. యురేనియంతో పోలిస్తే థోరియం ద్వారా తక్కువ వ్యర్థాలు వస్తాయి మరియు ఇది అత్యంత సురక్షితమైనది. మన దేశంలో ఉన్న థోరియం నిల్వలను పూర్తిగా వినియోగించుకోగలిగితే, వచ్చే 250 ఏళ్ల వరకు భారతదేశానికి అవసరమైన విద్యుత్తును ఎటువంటి అంతరాయం లేకుండా ఉత్పత్తి చేయవచ్చని అంచనా.
ప్రస్తుతం భారత అణు శాస్త్రవేత్తలు థోరియం ఆధారిత రియాక్టర్ల (Advanced Heavy Water Reactors) అభివృద్ధిలో నిమగ్నమై ఉన్నారు. ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే, ఇతర దేశాలపై ఇంధనం కోసం ఆధారపడాల్సిన అవసరం మనకు ఉండదు. ఇది కేవలం ఆర్థికంగానే కాకుండా, పర్యావరణ పరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. అగ్రరాజ్యాల కంటే ముందే ఈ ప్రయోగాలు విజయవంతం చేసి, అణుశక్తి రంగంలో భారత్ అజేయమైన శక్తిగా ఎదగడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.