ప్రసూతి ప్రయోజనాల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి: రాష్ట్ర లేబర్ కమిషనర్‌కు ‘కౌన్సిల్ ఫర్ సిటిజన్స్ వాయిస్’ (CCV) విజ్ఞప్తి.

తేది:17-04-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఐటీ మరియు కార్పొరేట్ సంస్థలలో ప్రసూతి ప్రయోజనాల చట్టం, 1961 (2017 సవరణ) ను కఠినంగా అమలు చేసేలా తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ ‘కౌన్సిల్ ఫర్ సిటిజన్స్ వాయిస్’ (CCV) తెలంగాణ రాష్ట్ర లేబర్ కమిషనర్‌కు ఒక వినతిపత్రాన్ని సమర్పించింది.
పని ప్రదేశాల్లో మహిళల ఆరోగ్యం, ఆత్మగౌరవాన్ని కాపాడే ఈ చట్టం పూర్తీ స్థాయిలో, ముఖ్యంగా ప్రైవేట్ మరియు కార్పొరేట్ రంగాల్లో కచ్చితంగా అమలు చేయాలని CCV ఆశాభావం వ్యక్తం చేసింది.
క్షేత్రస్థాయిలో పరిస్థితి ఉల్లంఘనలు:
చట్టం ప్రకారం 10 మందికి పైగా ఉద్యోగులున్న ప్రతి సంస్థలో మహిళలకు 26 వారాల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, 50 మంది దాటితే క్రెచ్ (శిశు సంరక్షణ కేంద్రం) వసతి, పాలిచ్చే తల్లులకు విరామం, వర్క్ ఫ్రమ్ హోమ్ తదితర సదుపాయాలు కల్పించాలి.
ప్రసూతి ప్రయోజనాలు మహిళల ప్రాథమిక హక్కు (ఆర్టికల్ 21) అని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది.
కానీ, ప్రైవేట్ సంస్థలలో గర్భవతులకు సెలవులు నిరాకరించడం, జీతాల్లో కోత విధించడం, గర్భధారణ సమయంలో బలవంతంగా ఉద్యోగాల నుంచి తొలగించడం మరియు తిరిగి విధుల్లో చేరిన తర్వాత ఆర్థిక జరిమానాలు లేదా డీమోషన్లు విధించడం వంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయని CCV తమ వినతిపత్రంలో పేర్కొంది.

లేబర్ కమిషనర్ ముందుంచిన ప్రధాన డిమాండ్లు:
వార్షిక నివేదికల్లో తప్పనిసరి వెల్లడి:కార్పొరేట్ కంపెనీలు తమ వార్షిక నివేదికలలో (Annual Reports) ఎంతమంది మహిళా ఉద్యోగులకు ప్రసూతి ప్రయోజనాలు కల్పించారా లేదా, క్రెచ్ వసతుల వివరాలను తప్పనిసరిగా పొందుపరిచేలా కార్మిక శాఖ ద్వారా ఆదేశాలు జారీ చేయాలి.
హక్కుల ప్రదర్శన:
ప్రతి కార్యాలయంలోని నోటీస్ బోర్డులపై ప్రసూతి హక్కులకు సంబంధించిన సమాచారాన్ని తెలుగు మరియు ఆంగ్ల భాషల్లో స్పష్టంగా ప్రదర్శించేలా యాజమాన్యాలను ఆదేశించాలి.
కఠిన చర్యలు & తనిఖీలు:
నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, కఠినమైన చట్టపరమైన, జరిమానాతో కూడిన చర్యలు తీసుకోవాలి.
గ్రీవెన్స్ సెల్ (ఫిర్యాదుల విభాగం): ప్రసూతి ప్రయోజనాలు నిరాకరించబడిన లేదా వేధింపులకు గురైన మహిళల కోసం కార్మిక శాఖలో ప్రత్యేక ఫిర్యాదుల విభాగాన్ని లేదా టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలి.
అవగాహన కార్యక్రమాలు:
రాష్ట్ర లేబర్ కమిషన్ తో కలిసి యాజమాన్యాలకు మరియు మహిళా ఉద్యోగులకు ఈ చట్టంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి.
పని ప్రదేశాల్లో మహిళల హక్కులను కాపాడేందుకు కార్మిక శాఖ (Labour Department) తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ ఫర్ సిటిజన్స్ వాయిస్ (CCV) కోరింది. ఈ కార్యక్రమంలో సీసీవీ సంస్థ సభ్యులు కె. నరేష్ బాబు, జి. మణికంఠ, కె. రామ్ మోహన్, కె. మల్లేశ్వరరావు, వి. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *