తేది:16-04-2026 TSLAW NEWS నల్గొండ జిల్లా ఇంచార్జ్ కానుగుల స్వామి.
నల్గొండ జిల్లా:నల్గొండ పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణకు, ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించడానికి భాగంగా “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం”ను పోలీసులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా “Arrive Alive” కార్యక్రమం నాలుగో రోజు నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘనంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా టూ టౌన్ సిఐ శ్రీ రాఘవరావు గారు, ఎస్ఐ శ్రీ సైదులు గారు నల్గొండ బస్టాండ్ ప్రాంతంలో సుమారు 70 మంది ఆటో డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
పోలీస్ అధికారులు మాట్లాడుతూ, ప్రతి డ్రైవర్ చట్టబద్ధమైన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం అత్యంత అవసరమని, వాహనానికి చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ ఉండాలని స్పష్టం చేశారు. అలాగే ఆటో డ్రైవర్లు విధి నిర్వహణ సమయంలో తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని సూచించారు.
ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని హెచ్చరించారు. ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించడం ద్వారా మంచి సేవా భావం పెంపొందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరుగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అలాంటి చర్యలకు పూర్తిగా దూరంగా ఉండాలని హెచ్చరించారు.
అలాగే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, వేగ పరిమితిని అతిక్రమించకూడదని, జాగ్రత్తగా వాహనం నడిపి ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చాలని తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా ఆటో డ్రైవర్లలో బాధ్యతాభావం పెంపొందించి, పట్టణంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. ఈ అవగాహన కార్యక్రమానికి ఆటో డ్రైవర్లు కూడా సానుకూలంగా స్పందించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించేందుకు సహకరిస్తామని తెలిపారు.