మహానగరంలో.. వలస కూలీల బతుకులు దుర్భరంగా మారుతున్నాయి. తినడానికి తిండి లేక..ఉండడానికి సరైన నీడ లేక నానా అవస్థలు పడుతున్నారు. పది రోజులుగా పని లేకపోవడంతో పూట గడవడం కష్టమై..కదిలిస్తే కన్నీటి పర్యంతమవుతున్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో వీరు సొంతూరుకు వెళ్లలేక..ఇక్కడ ఉపాధి లేక దిక్కుతోచని స్థితిలో మిగిలిపోయారు. నగరంలో అధికారిక లెక్కల ప్రకారం లక్షన్నరకు పైగానే వలస కూలీలు ఉన్నట్లు అంచనా. వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కువే ఉంటుంది. వీరంతా ఇక్కడి చిన్న మధ్యతరహా పరిశ్రమల్లో..నిర్మాణ రంగంలో కూలీలుగా పనిచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర జిల్లాల నుంచే కాకుండా ఒడిశా, బిహార్, చత్తీస్గడ్, మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి ఎక్కువ మంది ఇక్కడికి వస్తుంటారు. లాక్డౌన్ కారణంగా వీరికి ఎదురవుతున్న కష్టాలు గుర్తించిన ప్రభుత్వం..ప్రస్తుతం ఆదుకునే చర్యలు చేపట్టింది. వలస కార్మికుల్ని గుర్తించి ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం లేదా గోధుమ పిండి, రూ.500ల చొప్పున నగదు పంపిణీకి శ్రీకారం చుట్టాయి. స్వచ్చంద సంస్ధలు, ట్రేడ్ యూనియన్లు సైతం ఆదుకుంటున్నాయి.