అధికార పక్షాన్ని అదుపులో ఉంచే ‘షాడో క్యాబినెట్’ అంటే ఏమిటో తెలుసా..?

షాడో క్యాబినెట్ భారత దేశంలో ఈ పదం కొత్తగా అనిపించవచ్చు. కానీ అగ్ర దేశాలైన యూకే, ఆస్త్రేలియా కెనడా వంటి దేశాలలో షాడో క్యాబినెట్ విధానం అనుసరిస్తున్నారు. అయితే భారత్ లో ఎప్పటినుంచో షాడో క్యాబినెట్ ఉండాలనే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ఒడిశా రాష్ట్రంలో ఈ విధానాన్ని అమలు చేయాలని బీజేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ యోచిస్తున్నారు. గతంలో భారత్ లో కొన్ని రాష్ట్రాలు షాడో క్యాబినెట్ పేరుతో కాకుండా వేర్వేరు పేర్లతో అమలు చేయాలని చూశాయి. అయితే పూర్తి స్థాయిలో అమలు చేస్తున్న రాష్ట్రంగా ఒడిశా కు ఆ గౌరవం దగ్గబోతోంది. 21 నుంచి జరగనున్న ఒడిశా అసెంబ్లీ సమావేశాల నుంచి షాడో క్యాబినెట్ అమలు చేసేందుకు నవీన్ పట్నాయక్ నేతృత్వంలో బిజూ జనతా దళ్ (బీజేడీ) నేతలు సిద్ధపడుతున్నారు.

 

ఏమిటి ఈ ‘షాడో’ ప్రత్యేకత

 

ఇంతకీ షాడో క్యాబినెట్ అంటే ఏమిటి? దానికి ఉండే ప్రత్యేకత ఏమిటంటే..ప్రతిపక్షం బలంగా ఉంటేనే అధికార పక్షం దారి తప్పకుండా ఉంటుంది. అందుకే ప్రతిపక్ష నేతగా నవీన్ పట్నాయక్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ప్రత్యామ్నాయ క్యాబినెట్ రూపొందించుకుంటారు. అధికార పక్షం క్యాబినెట్ మాదిరిగానే షాడో క్యాబినెట్ లోనూ సంబంధిత శాఖల మంత్రులుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎంపిక చేస్తారు. అసెంబ్లీ, బడ్జెట్ సమావేశాలలో ఈ షాడో క్యాబినెట్ కు సంబంధించిన మంత్రాంగం తమకు కేటాయించిన శాఖలపై అధికార పక్షాన్ని నిలదీస్తాయి.

 

గందరగోళ పరిస్థితి లేకుండా..

 

మామూలుగా అసెంబ్లీ సమావేశాలలో అయితే అధికార పక్ణాన్ని విపక్షనేతలు ఒక్కసారిగా ప్రశ్నలు సంధించి ఇరుకున పెట్టాలని చూస్తారు. అధికార, ప్రతిపక్ష వాగ్వాదాలతో ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఏ అంశాన్ని ఎత్తి చూపాలని అనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితిలో స్పీకర్ సభను వాయిదా వేయడం జరుగుతుంది. అలాగే మర్నాడు కూడా..ఇలా సమావేశాలు జరిగినప్పుడల్లా సభను సజావుగా సాగనీయకుండా చేయడంతోనే కాలం గడిచిపోతుంది. అసెంబ్లీలో కీలక బిల్లులు పాస్ కాకపోవడానికి విపక్షాలే కారణం అంటూ అధికార పక్ష నేతలు వీరిపై నిందలు వేస్తుండటం, విపక్షాలు కావాలనే అధికార పక్షం బిల్లు పాస్ కాకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి సభలో గందరగోళ పరిస్థితికి కారణం అంటూ గొడవలు పడటం చూస్తునే ఉంటాం.అసెంబ్లీ సమావేశాలంటే ఏవో మొక్కుబడి తంతుగా ఇరు వర్గాల నేతలూ భావించడం వలనే అమూల్యమైన సమయం, డబ్బు వృధా అవుతున్నాయని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఇకపై అలాంటి పరిస్థితి లేకుండా..బలమైన ప్రతిపక్షం తరపున సమస్యలను హైలెట్ చేయాలని..దీని ద్వారా ప్రజలు కూడా అర్థం చేసుకుని మరో సారి అధకారం కట్టబెడతారని ప్రతిపక్ష నేతల నమ్మకం.

 

ప్రజలలో నమ్మకం పెంచేందుకు..

 

అయితే ప్రతిపక్ష నేతలలో ఎవరెవరికి ఏ శాఖపై పట్టు ఉందో, గతంలో మంత్రిగా ఏ శాఖలో పనిచేశారో అటువంటి అనుభవజ్ణులకే ప్రతిపక్ష క్యాబినెట్ లో చోటు దక్కుతుంది. అధికారికంగా షాడో క్యాబినెట్ కు ఎలాంటి పవర్స్ ఉండవు. కానీ అధికార పక్షం ఇష్టారీతిలో నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా చేయడంలో షాడో క్యాబినెట్ కీలక పాత్ర వహిస్తుంది. జనంలో కూడా ప్రతిపక్ష స్థానంలో తమ పార్టీ నేతలు ఏ విధంగా కష్టపడుతున్నారో..ప్రజా సమస్యల సాధన కోసం ఎలా పనిచేస్తున్నారో పారదర్శకంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక షాడో క్యాబినెట్ లో తాత్కాలికంగా శాఖలు నిర్వహించిన వారికి భవిష్యత్తులోనూ వారికే మంత్రి పదవులు దక్కే అవకాశం లేకపోలేదు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీసుకున్న ఈ నిర్ణయం స్ఫూర్తితో భారత్ లో మరిన్ని రాష్ట్రాధినేతలు తమ రాష్ట్రాలలోనూ ఈ తరహా షాడో క్యాబినెట్ ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి సారించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *