నీట్ యూజీ 2024 పరీక్షకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!

నీట్ యూజీ 2024 పరీక్షకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్షలో పేపర్ లీకైన మాట వాస్తవమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, లీకైన ఆ పేపర్ ఎంతమందికి చేరిందోననేది తేలియాల్సి ఉందని పేర్కొన్నది. పేపర్ లీక్ తో ఇద్దరు విద్యార్థులకే సంబంధం ఉందని అంటున్నారు.. కానీ, అది 23 లక్షల మందితో ముడిపడి ఉన్న అంశమంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందువల్ల, దీనిపై జాగ్రత్తగా పరిశీలించిన తరువాతే తీర్పు ఇస్తామని వెల్లడించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

 

అయితే, నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకైందని, అవకతవకలు జరిగాయంటూ పరీక్షను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మొత్తం 38 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

 

‘నీట్ ఎగ్జామ్ పేపర్ లీకైంది అన్న విషయం స్పష్టమైంది. పరీక్ష పవిత్రతను దెబ్బతీశారని రుజువైనా లేదా నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా మేం నీట్ రీ-టెస్ట్ కు ఆదేశాలిస్తాం. లీకైన ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో వ్యాప్తి చేశారని తెలిసినా మళ్లీ పరీక్ష నిర్వహించాలని చెబుతాం. కానీ, రీ-టెస్ట్ కు ఆదేశించే ముందు లీకైన పేపర్ ఎంతమందికి చేరిందో అనేది తేలాల్సి ఉంది’ అంటూ ధర్మాసనం పేర్కొన్నది.

 

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. ‘పేపర్ లీక్ తో ఇద్దరు విద్యార్థులకే సంబంధం ఉందంటున్నారు.. కానీ, అది 23 లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉన్న అంశం. అందువల్ల లీక్ ఎలా జరిగింది అనేది తెలుసుకోవాలి. లీకైన పేపర్ ఎంతమందికి చేరిందో అనేది గుర్తించారా..? ఎలా చేరిందో తెలుసుకున్నారా..? లీకేజీతో లబ్ధిపొందిన విద్యార్థులపై ఏం చర్యలు తీసుకున్నారు..? ఎంతమంది విద్యార్థుల ఫలితాలను హోల్డ్ లో పెట్టారు..? వీటికి సమాధానాలు కావాలి. వీటన్నిటిపైన సమగ్ర దర్యాప్తు జరగాలి’ అంటూ కేంద్రాన్ని ఆదేశించింది. అన్నీ పరిశీలించిన తరువాతనే దీనిపై తీర్పును వెల్లడిస్తామని చెప్పింది.

 

అదేవిధంగా నీట్ వ్యవహారంపై ఇప్పటివరకు జరిపిన దర్యాప్తుపై తమకు నివేదిక ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది కోర్టు. ప్రశ్నపత్రం తొలిసారి ఎప్పుడు లీకైందన్న విషయాన్ని వెల్లడించాలని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీకి ధర్మాసనం సూచించింది.

 

ఈ ఏడాది మే 5న దేశవ్యాప్తంగా నీట్ యూజీ -2024 పరీక్షను నిర్వహించారు. పరీక్ష పేపర్ లీక్ అవ్వడంతోపాటు పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తాయి. ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ రావడంపైనా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల గ్రేస్ మార్కులు కలిపిన 1563 మందికి మళ్లీ పరీక్ష నిర్వహించి.. సవరించిన నీట్ ర్యాంకుల జాబితాను ఎన్టీఏ విడుదల చేసింది. తాజా పరిణామాలతో కౌన్సెలింగ్ ను కూడా వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *