మానవ అక్రమ రవాణా గుట్టురట్టు చేసిన సీబీఐ.

భారత యువకులను రష్యాకు అక్రమంగా రవాణా చేస్తున్న రాకెట్‌పై దర్యాప్తునకు సంబంధించి రష్యాకు చెందిన క్రిస్టినా, రష్యాలో ఉన్న ఇద్దరు భారతీయులు సంతోష్, మహమ్మద్ మోయినుద్దీన్‌ల పేర్లను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.

 

లాభదాయకమైన ఉద్యోగాలు, విశ్వవిద్యాలయాలలో ప్రవేశాల వంటి ఆఫర్లను చూసి మోసపోయిన కొంతమంది భారతీయ జాతీయులు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు విడిచారు. దీంతో ఈ మానవ అక్రమ రవాణా విషయం వెలుగులోకి వచ్చింది. ఎఫ్‌ఐఆర్‌లో 19 మంది, వీసా కన్సల్టెన్సీ సంస్థలను సీబీఐ నిందితులుగా పేర్కొంది.

 

సీబీఐ పేర్కొన్న వారిలో ఢిల్లీ, ముంబై, థానే, హర్యానాలోని నాలుగు వీసా కన్సల్టెన్సీ ఏజెన్సీలు వాటి డైరెక్టర్లు.. హర్యానా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలలో ఒక జంటతో సహా అనుమానిత ఏజెంట్లు ఉన్నారు.

 

ఎఫ్ఐఆర్ ప్రకారం, భారతీయులను మెరుగైన ఉపాధి, అధిక జీతం వచ్చే ఉద్యోగాల సాకుతో రష్యాకు రవాణా చేసి మోసగించారని ఆరోపించారు. రష్యన్ ఆర్మీలో ఉద్యోగాలు, ఇతర అసైన్‌మెంట్ల సాకుతో భారతీయులను రష్యాకు అక్రమంగా రవాణా చేశారు. వారి నుంచి భారీ మొత్తంలో వసూలు చేశారని పేర్కొంది.

 

ఈ ఏజెంట్లు భారతీయ విద్యార్థులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విశ్వవిద్యాలయాలలో ప్రవేశం కల్పిస్తామని హామీ ఇచ్చి మోసగించారని, కానీ వారిని “అవాస్తవ” ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో ప్రవేశం కల్పిస్తున్నారని ఆరోపించారు.

 

“రష్యా చేరుకున్నప్పుడు, ఈ భారతీయుల పాస్‌పోర్ట్‌లను రష్యాలోని ఏజెంట్లు తీసుకున్నారు. వారికి యుద్ధ పాత్రల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు రష్యన్ ఆర్మీ యూనిఫాం అందజేస్తున్నారు. ఆ తర్వాత ఈ భారతీయ పౌరులు రష్యా-ఉక్రెయిన్ వార్ జోన్‌లోని ఫ్రంట్ బేస్‌ల వద్ద వారి ఇష్టానికి వ్యతిరేకంగా మోహరించారు. వారి జీవితాలను తీవ్ర ప్రమాదంలో పడేసారు” అని ఎఫ్‌ఐఆర్ పేర్కొంది.

 

కొంతమంది మానవ అక్రమ రవాణా బాధితులు కూడా యుద్ధ ప్రాంతంలో తీవ్రంగా గాయపడ్డారు.

 

ఢిల్లీకి చెందిన ఒక ఏజెన్సీ దాదాపు 180 మందిని విదేశాలకు పంపిందని, వారిలో ఎక్కువ మంది విద్యార్థులను రష్యాకు పంపినట్లు అధికారులు తెలిపారు. అయితే వార్ జోన్‌లో ఎంతమందిని మోహరించారు అనేది ఇంకా తేలలేదు.

 

ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న రష్యన్ మహిళ క్రిస్టినా కాగా , ఈ రాకెట్‌లో ప్రమేయం ఉన్న ఇద్దరు భారతీయులు ప్రస్తుతం రష్యాలో ఉన్నారు. తమిళనాడుకు చెందిన సంతోష్, రాజస్థాన్‌కు చెందిన మహ్మద్ మొయినుద్దీన్ చిప్పా ఉన్నారు. గుర్తించిన ఏజెంట్లలో మహారాష్ట్రకు చెందిన నలుగురు, కేరళ, తమిళనాడుకు చెందిన ముగ్గురు చొప్పున ఉన్నారు.

 

ఢిల్లీ, తిరువనంతపురం, ముంబయి, అంబాలా, చండీగఢ్‌, మదురై, చెన్నై తదితర ఏడు నగరాల్లోని 10కి పైగా ప్రాంతాల్లో గురువారం సీబీఐ సోదాలు నిర్వహించింది. బాధితులను విదేశాలకు పంపిన 35 ఉదంతాలను నిర్ధారించారు. 50 లక్షలకు పైగా డాక్యుమెంట్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్, డెస్క్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ రికార్డులను స్వాధీనం చేసుకోగా, కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వారిలో ఢిల్లీకి చెందిన 24×7 RAS ఓవర్సీస్ ఫౌండేషన్, దాని డైరెక్టర్ సుయాష్ ముకుత్, ముంబైకి చెందిన OSD బ్రోస్ ట్రావెల్స్ & వీసా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని డైరెక్టర్ రాకేష్ పాండే, చండీగఢ్‌కు చెందిన అడ్వెంచర్ వీసా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని డైరెక్టర్ మంజీత్ సింగ్ కూడా ఉన్నారు. దుబాయ్ ఆధారిత బాబా వ్లాగ్స్ ఓవర్సీస్ రిక్రూట్‌మెంట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, దాని డైరెక్టర్ ఫైసల్ అబ్దుల్ ముతాలిబ్ ఖాన్ పేరును కూడా సీబీఐ ఎఫ్ఐఆర్‌లో చేర్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *