మానవ అవయవాలతో అడ్డగోలుగా వ్యాపారం చేస్తూ పట్టుబడిన సింహపురి, శ్రద్ధ ఆసుపత్రుల ఉదంతాలు రాష్ట్రంలోని కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని మరోసారి చర్చనీయాంశం చేశాయి. కాసుల కోసం వైద్య రంగంలో నీతి నియమాలను, ప్రమాణాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న దాఖలాలు మన రాష్ట్రంలో కోకొల్లలు. మూత్ర పిండాల దగ్గర నుంచి, గుండె, లివర్, నేత్రాలు ఇలా మనిషి శరీరంలోని ప్రతి అవయవానికి వెల కట్టి అంగడిలో సరుకుగా మార్చేస్తుంటే ఏ దశలోను దీనిని గుర్తించి అడ్డుకునే నాథుడే కరువయ్యాడు. అవయవ దానం ఉచితమని అంటూనే ఆపరేషన్ పేరుతో దానికి రెట్టింపు ఫీజులను రోగులనుంచి పిండేస్తున్నాయి. శీనయ్య అనే నిరుపేద గిరిజనుడ్ని ఉదంతమే ఇందుకు ఒక తిరుగులేని ఉదాహరణ. రోడ్డు ప్రమాదంలో గాయపడిన శీనయ్యను ఆసుపత్రికి తీసుకెళ్తే ఆ పరీక్షలు, ఈ పరీక్షలు అని చేసి చివరికి ‘బ్రెయిన్ డెడ్’ అని చెప్పి 1.28 లక్షలు బిల్లు కట్టమన్నారు. బిల్లు కట్టకుంటే అవయవ దానం చేయాలని ఒత్తిడి చేశారు. డబ్బులు కట్టలేని ఆ నిరుపేద కుటుంబం గత్యంతరం లేని స్థితిలో అందుకు ఒప్పుకుంది. శీనయ్య గుండెను చెన్నరు కేంద్రంగా ఉన్న ఓ బడా కార్పారేట్ ఆసుపత్రికి, కిడ్నీని మరో ఆసుపత్రికి, రెండు కళ్లను ఇంకో కార్పొరేట్ ఆసుపత్రికి పంపారు.
కార్పొరేట్ ఆసుపత్రులు ఒక చైన్‌గా ఏర్పడి మానవ అవయవాలతో వ్యాపారం సాగిస్తున్నాయి. నెల్లూరులోని కార్పొరేట్ ఆసుపత్రి నిర్వాకం ఇలా వుంటే, విశాఖ లోని శ్రద్ధ ఆసుపత్రి కిడ్నీ రాకెట్‌కు అడ్డాగా మారింది. ఈ రెండు కార్పొరేట్ ఆసుపత్రులే అక్రమాలకు పాల్పడ్దాయని, మిగతావన్నీ బాగానే ఉన్నాయని అనుకోలేము. చాలా వరకు కార్పొరేట్ ఆసుపత్రులు చిన్న జబ్బును సైతం పెద్దదిగా చిత్రించి, భయానికి గురిచేసి రోగుల నుంచి భారీగా ఫీజులు పిండేసుకుంటున్నాయి.
శ్రద్ధ ఆసుపత్రిలో వ్యవహారంపై విచారణ జరిపిన త్రిసభ్య కమిటీ ఆ కార్పొరేట్ ఆసుపత్రిలో నిర్వహించిన 68 మూత్ర పిండ మార్పిడి శస్త్ర చికిత్సల్లో 29 అక్రమమైనవేనని నిగ్గు తేల్చింది. సరైన మౌలిక వసతులు కానీ, సూపర్ స్పెషాలిటీ నిపుణులు కానీ లేకుండా, శస్త్రచికిత్సలు చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడింది. ఏ శస్త్రచికిత్సకు ఎంత ఫీజు వసూలు చేసేది నిర్దిష్టంగా జాబితా పెట్టాలని నిబంధనలు ఘోషిస్తున్నా వాటిని కార్పొరేట్లు బేఖాతరు చేస్తున్నాయి. సామాజిక బాధ్యతను పూర్తిగా గాలికొదిలేశాయి.
వైద్యరంగంలో అధునాతన టెక్నాలజీని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కార్పొరేట్ ఆసుపత్రులకు ప్రభుత్వాలు సబ్సిడీలు, పన్నుల్లో రాయితీలు కల్పిస్తున్నందుకు ప్రతిగా ఇవి కొన్ని సామాజిక బాధ్యతలు నిర్వహించడం తప్పనిసరి అని చట్టాలు చెబుతున్నా వీటిని పాటించిన ఆసుపత్రులు చాలా అరుదు. పేదలు అధికంగా ఉండే మురికివాడలు, మారుమూల ప్రాంతాల్లో నెలకు రెండు సార్లు వైద్య సహాయ శిబిరాలు నిర్వహించాలి. నెలకు 25 శాతం ఓపిలు, 5 శాతం శస్త్ర చికిత్సలు పేదలకు ఉచితంగా అందించాలి అని ఆరోగ్య రంగంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత చట్టంలో ఉన్నా, వీటిని ఏ కార్పొరేట్ ఆసుపత్రి పాటించిన దాఖలాలు లేవు. నిబంధనలకు విరుద్ధంగా జనావాసాల మధ్య పెద్ద పెద్ద ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.
ఇది అటు ఆస్ప్రత్రులలోని రోగులకు, ఇటు బయట ప్రజానీకానికి ఇద్దరికీ ప్రమాదకరం కాదా? కార్పొరేట్ల సామాజిక బాధ్యత, అవి పాటించాల్సిని నియమ నిబంధనల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. అవగాహన ఉన్నా ఈ కార్పొరేేట్ దిగ్గజాలను నిలదీయగలిగే శక్తి ఎంతమందికుంటుంది? కార్పొరేట్ ఆసుపత్రుల అక్రమాలను అరికట్టేందుకు పటిష్టమైన పర్యవేక్షణ యంత్రాంగం లేదు.
ఉన్న యంత్రాంగం కూడా కార్పొరేట్ల జోలికి పోయే ధైర్యం చేయడం లేదు. నిజాయితీగల అధికారి ఎవరైనా ఆ పని చేస్తే వారికి బదిలీనే బహుమానం. కార్పొరేట్ వ్యవస్థ సమర్థవంతమైనదని ప్రభుత్వమే దానిని ఆకాశానికెత్తుతూ ప్రజా వైద్య వ్యవస్థను బలహీన పరచడంలోనే అసలు లోపముంది. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ వంటి ఆరోగ్య పథకాలు కార్పొరేట్ ఆసుపత్రులకు, ప్రైవేట్ బీమా కంపెనీలకు అయాచిత వరంగా పరిణమించాయి.
కార్పొరేట్ ఆసుపత్రులకు కళ్లెం వేయాల్సిన ఆవశ్యకత నేడు ఎంతైనా ఉన్నది. ఆసుపత్రులు వసూలు చేసే ఫీజులకు ఎటువంటి పరిమితులు లేకపోవడంతో అవి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. కాబట్టి దీనికి చెక్ పెట్టాలంటే ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని వేసి వైద్య ఫీజులను గట్టిగా నియంత్రించాలి. అవయవదానంలో అక్రమాలకు పాల్పడిన ఆసుపత్రుల యజామాన్యాలను తగు విధంగా శిక్షించాలి. కొత్త సిఎం తన చిత్తశుద్ధిని ప్రదర్శించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
