పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో సర్పంచ్ నామినేషన్ల సందర్భంగా ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామ టీడీపీలోని అంతర్గత విభేదాలు బయటపడటంతో స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అనుచరుడు నాగండ్ల రాంబాబు, పావులూరి శ్రీనివాసరావు వర్గాలు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశాయి. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఈ నేపథ్యంలో శ్రీనివాసరావుకు చెందిన మిల్లులో పోలీసులు తనిఖీలు నిర్వహించగా కర్రలు, కత్తులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, శ్రీనివాసరావు వర్గీయులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో శ్రీనివాసరావుతో పాటు మొత్తం 66 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట ఆయన వర్గీయులు ఆందోళనకు దిగడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.