తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు కౌంట్‌డౌన్.. మరో 500 రోజుల్లో బీఆర్‌ఎస్ అధికారంలోకి: కేటీఆర్

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని, మరో 500 రోజుల్లో బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2028లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని పేర్కొంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.

హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన జన చైతన్య సభలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు సంక్షేమం అందడం లేదని, రాష్ట్రంలో అభివృద్ధి కూడా కనిపించడం లేదని విమర్శించారు. ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పర్సంటేజీల పాలన సాగిస్తోందని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ మరింత బలోపేతమవుతుందని, ప్రజల మద్దతుతో తిరిగి అధికారాన్ని చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2028 ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో పార్టీ విజయం సాధిస్తుందని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.