విజయవాడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. శుక్రవారం ఆయన తన రాజీనామాను ప్రకటిస్తూ.. పార్టీ అధినాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రాజీనామా అనంతరం మాట్లాడిన అన్నపరెడ్డి, వైసీపీలో ఉన్న నాయకులకు, కష్టపడే కార్యకర్తలకు ఎలాంటి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు పార్టీలో ఎవరికీ అధికారిక సభ్యత్వాలే ఉండవని, సంతకాలు కూడా లేని లెటర్ ప్యాడ్లపై పదవులు ఇస్తూ ఊరడిస్తుంటారని విమర్శించారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని జగన్ పూర్తిగా ఒమ్ము చేశారని దుయ్యబట్టారు.
గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి పార్టీలోని అంతర్గత విభేదాలే కారణమని ఆయన బాంబు పేల్చారు. విజయవాడలో వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు, గుంటూరులో కూటమి అభ్యర్థుల విజయానికి వైసీపీలోని కొందరు సీనియర్ నేతలే వెనకుండి పనిచేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ వైఖరి వల్ల గతంలో లబ్ధి పొందిన వారు కూడా ఇప్పుడు ఆయన వెంట లేరని, రాష్ట్రంలో కూటమి ఐక్యంగా ఉన్నంత కాలం జగన్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమని స్పష్టం చేశారు. త్వరలోనే విజయసాయి రెడ్డి పెట్టబోయే కొత్త పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించి, తదుపరి రాజకీయ ప్రయాణంపై స్పష్టత ఇచ్చారు.