ఏపీ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ మొదలైందా? నేతల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అంశాలకు దూరంగా ఉండాలని రాజకీయ పార్టీలు డిసైడ్ అయ్యాయా? జనసేన అధినేత పవన్ కల్యాణ్ విడాకుల అంశంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ వేళ టీడీపీ-వైసీపీ రంగంలోకి దిగాయా? తమ పార్టీ కార్యకర్తలకు ఈ రెండు పార్టీలు వార్నింగ్ ఇచ్చాయి.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ నేతల వ్యక్తిగత అంశాలపై సోషల్ మీడియాపై రకరకాల వ్యాఖ్యలు చేస్తుండడంతో కేసులు నమోదు చేసింది. అన్ని పార్టీలపై కేసు నమోదు చేయడంతో వాటికి చాలామంది దూరంగా ఉన్నారు. ఒకానొక దశలో టీడీపీ కార్యకర్తలను ప్రభుత్వం అరెస్టు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
నాయకుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అంశాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు, అనుచిత వ్యాఖ్యల వేళ ఐ-టీడీపీ, వైఎస్ఆర్సీపీ పార్టీలు కీలక ప్రకటనలు విడుదల చేశాయి. నేతల వ్యక్తిగత విషయాలపై బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని తమ తమ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రతినిధులకు సూచనలు చేశాయి. రాజకీయ విమర్శలు – వ్యక్తిగత జీవితాల మధ్య స్పష్టమైన హద్దులు పాటించాలని పేర్కొన్నాయి. మేము ఇలాగే ఉంటామని భావించి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని ఘాటు వార్నింగ్ ఇచ్చాయి. ఈ మేరకు రెండు పార్టీల నుంచి లేఖలు విడుదలయ్యాయి.!
మిత్రపక్షం, వైసీపీ నాయకుల వ్యక్తిగత జీవితాలపై అనుచిత వ్యాఖ్యలు, చర్చలు చేయడం ఆమోద యోగ్యం కాదని ఐ టీడీపీ వెల్లడించింది. నాయకుల వ్యక్తిగత జీవితాలపై ఎలాంటి చర్చలు, వ్యాఖ్యలు చేయరాదని పేర్కొంది. ఐటీడీపీతో సంబంధం ఉన్న ఖాతాలు ఎవరైనా ఆ తరహా పోస్టులు పెడితే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వ్యక్తిగతంగా చేసే అనుచిత వ్యాఖ్యలు, అభిప్రాయాలతో ఐటీడీపీకి ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేసింది. గౌరవం, సంయమనం, బాధ్యత అనే సూత్రాలను పాటించాలని నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చింది.
అటు వైసీపీ కూడా ఈ తరహా ప్రకటన చేసింది. నేతల వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు, ప్రకటనలు చేయవద్దని పేర్కొంది. సోషల్ మీడియా చర్చలకు దూరంగా ఉండాలని, వాటికి సంబంధించిన పోస్టులపై చర్చలు, స్పందించడం మానుకోవాలని పేర్కొంది. కంటెంట్‌ను షేర్ చేయవద్దని, అన్ని బహిరంగ సంభాషణల్లో గౌరవ ప్రదమైన, బాధ్యతాయుతమైన వైఖరిని కొనసాగించాలని తెలిపింది. వాటిని పార్టీకి సంబంధించిన వాు తప్పనిసరిగా పాటించాలని కోరింది.