వాగులో కొట్టుకుపోయిన వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది.. జేసీబీతో రక్షించిన పోలీసులు

మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలంలో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. దీంతో తెల్లగట్ల వద్ద చప్టాపై నుంచి వరదనీరు ఉధృతంగా ప్రవహించింది. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తి అదుపుతప్పి వాగులో పడిపోయాడు.

వరద ప్రవాహంలో సుమారు 50 మీటర్ల దూరం కొట్టుకుపోయిన సునీల్ కుమార్ చెట్ల మధ్య చిక్కుకుపోయాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్సై సాంబశివరావు వెంటనే సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు.

జేసీబీ సహాయంతో చెట్ల మధ్య చిక్కుకున్న సునీల్ కుమార్‌ను పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సకాలంలో స్పందించి అతడిని రక్షించడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసుల చర్యపై స్థానికులు అభినందనలు తెలిపారు.