ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ‘నూతన నేతన్న భరోసా పెన్షన్’ దరఖాస్తు విధానంలో కీలక నిబంధనను సడలించినట్లు మంత్రి సవిత తెలిపారు. ఇకపై పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే చేనేత కార్మికులు బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్ సమర్పించాల్సిన అవసరం లేదు. మాస్టర్ వీవర్ ధ్రువీకరణ పత్రంతో పాటు వేతన వివరాలు అందజేస్తే సరిపోతుందని స్పష్టం చేశారు.
ఈ నిబంధన సడలింపుతో 50 ఏళ్లు నిండిన అర్హులైన నేతన్నలకు పెన్షన్ దరఖాస్తు ప్రక్రియ మరింత సులభతరం కానుంది. అర్హత ఉన్న కార్మికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. నేతన్నలకు సామాజిక భద్రత, ఆర్థిక సహాయం అందించే దిశగా ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పేద కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించే ‘ఎన్టీఆర్ భరోసా పింఛన్’ పథకం కింద కొత్త దరఖాస్తుల నమోదును ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ నెల 7న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణకు ప్రజల నుంచి స్పందన లభిస్తోంది. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాల ద్వారా కేవలం ఐదు రోజుల్లోనే 6,81,501 దరఖాస్తులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది.