ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో విజయనగరం జిల్లాలో విద్యుత్ వినియోగం గత ఏడాదితో పోలిస్తే 26 శాతం పెరిగిందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు.
విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరగడంతో సాయంత్రం వేళల్లో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కోతలు చోటుచేసుకుంటున్నాయని, దీంతో ప్రజలకు కొంత అసౌకర్యం కలుగుతోందని మంత్రి పేర్కొన్నారు. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరాను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
పెరిగిన విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచాలని బుధవారం జరిగిన సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఏపీ జెన్‌కో అధికారులను ఆదేశించినట్లు కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.