యాపిల్‌ నుంచి తొలి ఫోల్డబుల్‌ ఐఫోన్‌.. ‘ఐఫోన్ డ్యూయో’లో అదిరిపోయే ఫీచర్లు

గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ తన ‘సర్‌ప్రైజ్ అండ్ షైన్’ ఈవెంట్‌లో పలు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో సరికొత్త ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడళ్లతో పాటు యాపిల్ చరిత్రలోనే తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా ‘ఐఫోన్ డ్యూయో’ను పరిచయం చేసింది. దీంతో ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్‌లోకి యాపిల్ కూడా అధికారికంగా అడుగుపెట్టినట్లైంది.

ఐఫోన్ డ్యూయో డిజైన్ విషయంలో ఇతర ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లకు భిన్నమైన అనుభూతిని అందించేలా రూపొందించారు. గెలాక్సీ జీ ఫోల్డ్ 8 తరహాలోనే ఫోన్‌ను మడిచినప్పుడు సాధారణ స్మార్ట్‌ఫోన్‌లా, పూర్తిగా తెరిచినప్పుడు ఐప్యాడ్‌ను పోలిన విశాలమైన డిస్‌ప్లేను అందిస్తుంది. పెద్ద స్క్రీన్ అవసరమైనప్పుడు డివైజ్‌ను విప్పి ఉపయోగించుకోవచ్చు.

ఐఫోన్ డ్యూయోలో మల్టీటాస్కింగ్‌కు కూడా యాపిల్ ప్రాధాన్యత ఇచ్చింది. ఐఫోన్ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి రెండు యాప్‌లను స్క్రీన్‌పై పక్కపక్కనే ఉపయోగించే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఒకవైపు వీడియో చూస్తూనే మరోవైపు మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం వంటి పనులను సులభంగా చేసుకోవచ్చు. ఈ ఫీచర్లు ఫోల్డబుల్ ఐఫోన్‌కు వినియోగదారుల్లో ఎలాంటి స్పందన తీసుకొస్తాయో చూడాలి.