11 నెలలుగా జీతాలు అందక ఆరోగ్యశ్రీ సిబ్బంది ఆవేదన

నాగార్జునసాగర్‌లోని కమలా నెహ్రూ ఆసుపత్రి ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందికి గత 11 నెలలుగా జీతాలు అందడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు అందకపోవడంతో కుటుంబ ఖర్చులు, ఇతర ఆర్థిక అవసరాలను తీర్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.

కాంట్రాక్ట్ ఏజెన్సీ ‘అభయ మేన్‌పవర్ సప్లయర్స్’ నిర్లక్ష్యం కారణంగానే తమ వేతనాలు నిలిచిపోయాయని సిబ్బంది ఆరోపిస్తున్నారు. జీతాల కోసం పలుమార్లు సంబంధిత అధికారులను, ఏజెన్సీ ప్రతినిధులను సంప్రదించినప్పటికీ సమస్య పరిష్కారం కాకుండా కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని సిబ్బంది కోరుతున్నారు. 11 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.