ఉద్యోగులకు రూ.కోటి ఉచిత బీమా.. దేశంలోనే తొలిసారన్న భట్టి విక్రమార్క

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది, పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు ప్రభుత్వం అందిస్తున్న రూ.కోటి ఉచిత ప్రమాద బీమా పథకం దేశంలోనే తొలిసారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో తెలిపారు. ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడకుండా అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వంపై, ఉద్యోగులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా బ్యాంకర్ల భాగస్వామ్యంతో ఈ బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు.

ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 12,91,056 మంది లబ్ధి పొందుతున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. వీరిలో 5,18,293 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 5,00,158 మంది తాత్కాలిక, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌, మల్టీపర్పస్‌ వర్కర్లు, డైలీవేజ్‌, ఎన్ఆర్ఈజీఎస్‌, ఎంటీఎస్‌, సెర్ప్‌ సిబ్బంది ఉన్నారని వివరించారు. మరో 2,72,600 మంది పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు కూడా ఈ బీమా వర్తిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే 98 క్లెయిమ్‌లను పరిష్కరించి బాధిత కుటుంబాలకు కోట్ల రూపాయల చెల్లింపులు చేసినట్లు తెలిపారు.

ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రత కోసం బీమాతో పాటు ప్రత్యేక హెల్త్‌కార్డులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక, ఆరోగ్య భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రమాద సమయంలో కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందేలా బీమా క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.