అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన అమలాపురం పార్లమెంట్ జనసేన కార్యకర్తల సమావేశంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. కాపు సామాజిక వర్గం, జనసేన భవిష్యత్ వ్యూహం, స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో కాపులు లేని రాజకీయాలు లేవని, పవన్ కల్యాణ్ లేకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఉండవని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పవన్ కల్యాణ్ నాయకత్వం వల్లే కాపు సామాజిక వర్గానికి రాజకీయంగా ప్రాధాన్యం పెరిగిందని పేర్కొన్నారు. కోనసీమలో కాపులు అధికంగా ఉన్నందున వారిని కొందరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో అమలాపురంలో కులాల పేరుతో విభజనలు సృష్టించారని విమర్శించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు బలం ఉన్న ప్రాంతాల్లో పార్టీ తప్పకుండా పోటీ చేయాలని బొలిశెట్టి సూచించారు. 2029 అసెంబ్లీ ఎన్నికల నాటికి జనసేన బలాన్ని 50 నుంచి 60 అసెంబ్లీ స్థానాల స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల్లో పార్టీ బలోపేతం అయితేనే భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించగలమని, స్థానిక సంస్థల ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలకు పునాదిలాంటివని పేర్కొన్నారు.