యూట్యూబ్‌లో లండన్ లైఫ్‌స్టైల్ వీడియోలు, చిరునవ్వులతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఫేమస్ యూట్యూబర్ నందన అలియాస్ రమానందనకు ఊహించని పరిణామం ఎదురైంది. విదేశాల్లో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామంటూ కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె.. యూకేలో ఉంటూ తాజాగా భారత్‌కు తిరిగి వచ్చారు.
యూకే నుంచి హైదరాబాద్ చేరుకున్న రమానందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని ఇబ్రహీంపట్నం పోలీసులు ఇప్పటికే నందన దంపతులపై లుక్‌ఔట్ సర్క్యులర్ జారీ చేశారు. దీంతో ఎయిర్‌పోర్ట్ అలర్ట్ సిస్టమ్ ద్వారా ఆమెను గుర్తించిన అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు రమానందనను కస్టడీలోకి తీసుకుని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విదేశాల్లో ఉద్యోగాలు, వీసాల పేరుతో జరిగినట్లు ఆరోపిస్తున్న మోసం కేసులో ఆమెను పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.