కాళోజీ జయంతి వేడుకలు.. ఘనంగా నివాళులర్పించిన 17వ పోలీస్‌ బెటాలియన్‌

తెలంగాణ ప్రజాకవి, ప్రముఖ సాహితీవేత్త, సామాజిక చైతన్యవాది కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 17వ పోలీస్‌ బెటాలియన్‌లో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు చిత్రపటానికి 17వ పోలీస్‌ బెటాలియన్‌ కమాండెంట్‌ పి.జె.పి.సి. ఛటర్జీ పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కమాండెంట్‌ మాట్లాడుతూ.. కాళోజీ నారాయణరావు 1914 సెప్టెంబర్‌ 9న జన్మించారని తెలిపారు. ఆయన జయంతిని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తూ.. తెలంగాణ భాష, యాస, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలను స్మరించుకుంటోందని పేర్కొన్నారు. కాళోజీ తన రచనలు, ఆలోచనల ద్వారా ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చారని అన్నారు.

తెలంగాణ సాహిత్య, సామాజిక, ప్రజా ఉద్యమాల చరిత్రలో కాళోజీ నారాయణరావు చెరగని ముద్ర వేశారని కమాండెంట్‌ కొనియాడారు. తెలంగాణ ప్రజల సమస్యలు, ఆకాంక్షలను తన రచనల్లో ప్రతిబింబిస్తూ సమాజాన్ని చైతన్యపరిచిన మహనీయుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని పేర్కొన్నారు. కాళోజీ ఆశయాలను, తెలంగాణ భాషా సంస్కృతి గొప్పతనాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.