హిమాలయ దేశం నేపాల్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో పలు ప్రధాన నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో మధ్య, పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
సింధూలి జిల్లాలోని సన్ కోశీ, గూర్ఖా జిల్లాలోని బుధి గండకి, దడెల్ధురా జిల్లాలోని మహాకాళి నదుల్లో నీటిమట్టాలు ఇప్పటికే హెచ్చరిక స్థాయిని దాటినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆయా నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో ఆందోళన నెలకొంది. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు లమ్‌జంగ్ జిల్లాలోని మర్స్యంగ్ది నదిలో ప్రవాహం ఇప్పటికే ప్రమాద స్థాయిని దాటినట్లు ఫ్లడ్ ఫోర్‌కాస్టింగ్ డివిజన్ వెల్లడించింది. నీటిమట్టం ఇంకా పెరుగుతూనే ఉండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. నదుల సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు.