కరీంనగర్‌లో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.. వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లింది. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తున్న బస్సులో ఘటన సమయంలో మొత్తం 54 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు బావిలో పడిపోకుండా అంచునే ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై ప్రయాణికులను బస్సు నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

బస్సు అదుపుతప్పి నేరుగా వ్యవసాయ బావి వైపు దూసుకెళ్లడంతో కొద్దిసేపు ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. అయితే బస్సు బావిలోకి పడకుండా ఆగిపోవడంతో 54 మంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.