Tim Cook: యాపిల్ సీఈఓగా టిమ్ కుక్‌కు వీడ్కోలు.. ఉద్యోగులకు భావోద్వేగ మెమో

టెక్ ప్రపంచంలో ఓ కీలక అధ్యాయం ముగిసింది. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సీఈఓగా సుదీర్ఘకాలం సేవలందించిన టిమ్ కుక్ తన పదవికి అధికారికంగా వీడ్కోలు పలికారు. సీఈఓగా తన చివరి రోజున యాపిల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు ఓ భావోద్వేగపూరిత ఫైనల్ మెమోను పంపించారు. తన ప్రయాణంలో సంస్థ ఉద్యోగులు అందించిన సహకారాన్ని ఆయన ఈ సందేశంలో గుర్తుచేసుకున్నట్లు తెలుస్తోంది.

2011లో యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ నుంచి సీఈఓ బాధ్యతలు స్వీకరించిన టిమ్ కుక్.. సంస్థను కొత్త దశలోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన నాయకత్వంలో యాపిల్ తన ఉత్పత్తులు, సేవలను విస్తరించడంతో పాటు ప్రపంచ టెక్ రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. సీఈఓగా తన చివరి సందేశంలో కుక్.. స్టీవ్ జాబ్స్ ఆలోచనలు, సంస్థకు ఆయన వేసిన బలమైన పునాదిని ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు.

స్టీవ్ జాబ్స్ నుంచి బాధ్యతలు స్వీకరించిన రోజులను గుర్తు చేసుకున్న టిమ్ కుక్.. యాపిల్‌ను ముందుకు నడిపించిన విలువలు, ఆలోచనా విధానాలను ప్రస్తావించినట్లు సమాచారం. ఉద్యోగుల సమష్టి కృషి వల్లే సంస్థ ఈ స్థాయికి చేరుకుందని పేర్కొంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. టిమ్ కుక్ వీడ్కోలుతో యాపిల్ నాయకత్వంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.