రూ.132 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి.. రూ.2,800 కోట్లకు పైగా వసూళ్లు! ఈ చైనీస్ మూవీ సెన్సేషన్

సినిమా భారీ విజయం సాధించాలంటే భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, అద్భుతమైన విజువల్స్ మాత్రమే అవసరం లేదని ‘డియర్ యూ’ మరోసారి నిరూపిస్తోంది. కంటెంట్ బలంగా ఉంటే తక్కువ పెట్టుబడితో తెరకెక్కిన సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకోగలదని ఈ మూవీ చూపించింది. ఇప్పటికే ‘హనుమాన్’ వంటి సినిమాలు ఇదే విషయాన్ని నిరూపించగా.. ఇప్పుడు చైనాకు చెందిన ‘డియర్ యూ’ ఏకంగా వేల కోట్ల వసూళ్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

హాంగ్‌చున్ లాన్ దర్శకత్వం వహించిన ‘డియర్ యూ’ 2026 ఏప్రిల్ 30న చైనాలో థియేటర్లలో విడుదలైంది. సుమారు 14 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించినట్లు సమాచారం. భారత కరెన్సీలో ఈ మొత్తం దాదాపు రూ.132 కోట్లకు సమానం. అయితే ఈ సినిమాకు వచ్చిన స్పందన మాత్రం పెట్టుబడికి ఎన్నో రెట్లు అధికంగా ఉండటం విశేషం. చైనీస్ ప్రేక్షకులు సినిమాను భారీగా ఆదరించడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు వేగంగా పెరిగాయి.

తాజా నివేదికల ప్రకారం ‘డియర్ యూ’ చైనాలో ఇప్పటికే 300 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.2,849 కోట్లకు సమానం. కేవలం చైనాలోనే ఇంత భారీ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా త్వరలో అమెరికాలోనూ విడుదల కానుంది. దీంతో అక్కడ కూడా మూవీకి ఎలాంటి స్పందన లభిస్తుందోనని సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి భారీ వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో ‘డియర్ యూ’ ఇప్పుడు ప్రత్యేకంగా నిలుస్తోంది.