Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయానికి కీలక ముందడుగు.. సెప్టెంబర్ 7న కేంద్ర బృందం పర్యటన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదనపై మరో కీలక ముందడుగు పడింది. విమానాశ్రయ నిర్మాణానికి అనువైన స్థలాల ఎంపిక కోసం కేంద్ర సాంకేతిక బృందం సెప్టెంబర్ 7న తెలంగాణలో పర్యటించనుంది. న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో సమావేశమైన అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయాన్ని వెల్లడించారు.

గతంలో పరిశీలించిన రెండు ప్రాంతాలు సాంకేతిక కారణాలతో విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా లేవని తేలినట్లు మంత్రి తెలిపారు. దీంతో తాజాగా మరో నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించినట్లు చెప్పారు. ఈ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, రన్‌వే నిర్మాణానికి అనువైన స్థితి వంటి అంశాలను కేంద్ర సాంకేతిక బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది.

కేంద్ర బృందం ఇచ్చే నివేదిక కీలకంగా మారనుంది. స్థలాలపై సాంకేతిక నివేదిక అనుకూలంగా వస్తే కొత్తగూడెం విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన తదుపరి చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విమాన సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశాలపై స్థానికుల్లో ఆశలు పెరుగుతున్నాయి.