భారత్‌ను అన్ని విధాలుగా సురక్షిత దేశంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలో నివసించే హక్కు భారత పౌరులకు మాత్రమే ఉంటుందని ఆయన అన్నారు. దేశ భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని స్పష్టం చేశారు.
సరిహద్దుల్లో భద్రతా బలగాల కళ్లుగప్పి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అమిత్ షా హెచ్చరించారు. అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని తెలిపారు. భారత్ భద్రతకు తమ ప్రభుత్వం నూటికి నూరు శాతం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
త్వరలోనే దేశాన్ని పూర్తిగా చొరబాట్ల రహిత ప్రాంతంగా మారుస్తామని అమిత్ షా వెల్లడించారు. ఎవరు పడితే వారు వచ్చి నివసించేందుకు భారత్ ధర్మశాల కాదని ఆయన వ్యాఖ్యానించారు. దేశ సరిహద్దులు, అంతర్గత భద్రతను కాపాడటంలో ప్రభుత్వం కఠిన వైఖరితో ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.