ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు శ్రీకారం

పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆవరణలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు బుధవారం పరిశీలించారు. దేవాదాయ శాఖ స్థపతితో కలిసి ఆలయ ప్రాంగణంలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించి.. వాటి పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం దాతల సహకారంతో నూతనంగా నిర్మించనున్న భక్తుల 22 వసతి గృహాల సముదాయానికి విజయరమణ రావు భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు.

అంతకుముందు ప్రభుత్వ విప్ విజయరమణ రావు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని తెలిపారు.